- పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల పాండురంగరావు
సిటీ బ్యూరో: ( ప్రభంజనం )
తెలంగాణ రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పట్టభద్రుల ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ ప్రారంభమైనందున, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యులు గొట్టుముక్కల పాండురంగరావు కోరారు.
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు తాజా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి తాజాగా ఫారం-18 సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. 2026 నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 25న, తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కావాలంటే సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండటంతో పాటు, అర్హత తేదీకి కనీసం మూడు సంవత్సరాల ముందు పట్టా లేదా సమానమైన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. ఫారం-18తో పాటు అవసరమైన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
పట్టభద్రుల ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువు ముగిసేలోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని పాండురంగారావు తెలిపారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు కూడా మళ్లీ ఫారం-18 సమర్పించి తమ పేరు పట్టభద్రుల ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని గొట్టుముక్కల పాండురంగరావు కోరారు. అర్హులైన పట్టభద్రులు ఆన్‌లైన్‌లో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే సంబంధిత ఈఆర్ ఓ/ఏఈఆర్ ఓ, నియమిత అధికారుల వద్ద ఫారం-18 సమర్పించవచ్చని అన్నారు.


