Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaఎవరికి వారే యమున తీరే.. నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్

ఎవరికి వారే యమున తీరే.. నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్

📰 Generate e-Paper Clip

  • ఎవరికి వారే యమున తీరే..
  • నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్
  • వర్గాపోరుతో క్యాడర్ అయోమయం..
  • బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ క్యాడర్

నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ లో అయోమయ పరిస్థితి నెలకొంది. ముఖ్యనేతలు ఎవరికివారే వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు ఏ వైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యనేతల తీరువల్ల కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వినికిడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయినా, ముఖ్యనాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు అధిష్టానం దగ్గర మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నర్సాపూర్ నియోజకవర్గంలో టికెట్ తమకే వస్తుందని ఎవరికి వారు కార్యకర్తల్లో భరోసా కల్పిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో 3 వర్గాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఒక వర్గానికి, మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిరెండో వర్గానికి, మెదక్ జిల్లా పీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ మూడో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఈ ముగ్గురి వర్గ పోరు కారణంగా నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీని మూడు ముక్కలుగా చేస్తున్నారని కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు.

అసంతృప్తిలో కేడర్

స్థానిక సమస్యల పరిష్కారంలో గానీ, ప్రభుత్వ పథకాల అమలులో గానీ సమన్వయం లేకపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మా కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ప్రతి నేత తన వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బీఆర్ఎస్ వైపు చూపు

ఇదే అదునుగా భావించిన బీఆర్ ఎస్ నేతలు నర్సాపూర్ లో కాంగ్రెస్ అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమంది మండల, గ్రామ స్థాయి నాయకులు బీఆర్ ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అధికార పార్టీగా ఉండి కూడా నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్నామనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ వర్గ పోరు సద్దుమణగకపోతే నర్సాపూర్ లో కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని నర్సాపూర్ లో ఐక్యతను తీసుకురాకపోతే, ఎవరికి వారే యమున తీరే.. అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి తయారవుతుందనడంలో సందేహం లేదు.

బీఆర్ఎస్ బలోపేతం.. కాంగ్రెస్ కు కష్టాలు..

ప్రస్తుతం నర్సాపూర్ లో బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ, సమస్యలను స్వయంగా పరిష్కరిస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేసి, ప్రతి గ్రామంలోని సమస్యలపై స్పందిస్తుండటంతో ఆమె తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోని మూడు వర్గాలు కలిసి పనిచేసినప్పటికీ, అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ సునీతా లక్ష్మారెడ్డి గెలుపొంది తన సత్తా చాటారు.

ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత, పైగా ముఖ్యనాయకుల మధ్య వర్గాపోరు తీవ్రంగా ఉండటంతో నర్సాపూర్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి ప్రజల్లో పెంచుకుంటున్న పట్టు, కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలతో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ మరింత బలోపేతం అవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.