Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్గడువు ముగియకముందే కరెంట్ కట్.. లైన్‌మన్‌పై చర్యలకు ఆదేశం

గడువు ముగియకముందే కరెంట్ కట్.. లైన్‌మన్‌పై చర్యలకు ఆదేశం

📰 Generate e-Paper Clip

  • లైన్‌మన్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

మేడ్చల్ ప్రతినిధి (ప్రభంజనం): విద్యుత్‌ బిల్లు చెల్లించేందుకు గడువు ముగియకముందే వినియోగదారుడి విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఘటనపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత లైన్‌మన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎస్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించింది. ఆదేశాలు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

జగద్గిరిగుట్ట మక్దూమ్‌నగర్‌కు చెందిన వాకిటి మధుబాబు (సర్వీస్‌ నం. 0905 08395) తన విద్యుత్‌ కనెక్షన్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా నిలిపివేశారంటూ ఫోరాన్ని ఆశ్రయించారు. మే నెల విద్యుత్‌ బిల్లుకు సంబంధించి రూ.4,264 బకాయి ఉందని అధికారులు పేర్కొన్నప్పటికీ.. బిల్లు చెల్లించాల్సిన గడువు 2026 మే 21గా ఉందని ఫిర్యాదులో తెలిపారు.

అయితే గడువు ముగిసిన తర్వాత కాకుండా మే 25న లైన్‌మన్‌ రాకేష్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారని పేర్కొన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సరఫరా నిలిపివేయడం నిబంధనలకు విరుద్ధమని ఫోరం పేర్కొంది. బకాయిల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసే ముందు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వినియోగదారుడికి తగిన గడువు, నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఫోరం నిర్ధారించింది. దీంతో 2026 మే 27న వినియోగదారుడు దాఖలు చేసిన ఫిర్యాదును అనుకూలంగా పరిష్కరిస్తూ ఆగస్టు 18న ఆదేశాలు జారీ చేసింది.

గడువుకు ముందే విద్యుత్‌ సరఫరా నిలిపివేసినందుకు బాధ్యుడైన లైన్‌మన్‌ రాకేష్‌పై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎస్‌పీడీసీఎల్‌ను ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.

ఈ విషయంపై జగద్గిరిగుట్ట ఏఈ రాధాకృష్ణను వివరణ కోరేందుకు ‘ప్రభంజనం’ ప్రతినిధి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.