శేరిలింగంపల్లి (ప్రభంజనం): హైదరాబాద్‌లోని ఖాజాగూడ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాజాగూడ నుంచి అంజయ్యనగర్ వైపు ముగ్గురు వ్యక్తులు ( డబ్ల్యూ 26 బీఎం 2608 ) మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు.
ఈఎస్ ఐ రెండో గేట్ సమీపంలో కేర్ హాస్పిటల్ మెయిన్ రోడ్ వైపు కుడివైపు మలుపు తీసుకుంటుండగా, వేగంగా వాహనం నడపడం, మలుపులో నియంత్రణ కోల్పోవడంతో బైక్ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సహస్ర ఛటోపాధ్యాయ్ (25), మధ్యలో కూర్చున్న అభిజిత్ సింగ్ (25) గాయపడ్డారు.
వారిని చికిత్స నిమిత్తం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. చివరిగా కూర్చున్న అబ్బాస్ సిద్ధిఖ్ (25) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు, గాయపడిన ఇద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


