Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డి22-A భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి:మారయ్య

22-A భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి:మారయ్య

📰 Generate e-Paper Clip

  • సర్వే నంబర్లపై సమగ్ర విచారణ జరిపించాలి
  • ప్రభుత్వం తీరును ఎండగట్టిన తెలంగాణ రక్షణ సేన 

మేడ్చల్ (ప్రభంజనం) : కుత్బుల్లాపూర్ మండల పరిధిలో 22-A కింద నిషేధిత భూములుగా పేర్కొంటున్న సర్వే నంబర్లపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య డిమాండ్ చేశారు.ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత భూములుగా పేర్కొన్న ఆయా భూములకు ప్రస్తుత హక్కుదారులు ఎవరు, ఏ కారణాలతో వాటిని 22-A జాబితాలో చేర్చారు, సంబంధిత భూహక్కుదారులకు నోటీసులు ఇచ్చారా, భూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించారా అనే అంశాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, అనేక కుటుంబాలకు అది జీవనాధారమని మారయ్య అభిప్రాయపడ్డారు. 22-A జాబితా కారణంగా రిజిస్ట్రేషన్, వారసత్వ బదలాయింపు, బ్యాంకు రుణాలు, ఇతర చట్టపరమైన వ్యవహారాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.22-A జాబితాలో ఉన్న ప్రతి సర్వే నంబర్‌పై సమగ్ర విచారణ చేపట్టి, భూములను నిషేధిత జాబితాలో చేర్చిన కారణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.సంబంధిత పట్టాదారు వివరాలు, హక్కుల పత్రాలను పరిశీలించి అర్హులైన భూహక్కుదారులకు న్యాయం చేయాలని కోరారు.

ఆధారాలు లేకుండా లేదా తప్పుగా 22-A జాబితాలో చేర్చిన భూములను గుర్తించి చట్ట ప్రకారం పునఃపరిశీలించాలని, పూర్తి సర్వే నంబర్ల జాబితా, సంబంధిత కారణాలు, రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.కుత్బుల్లాపూర్ ప్రజల భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చట్టబద్ధమైన ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఎత్తరి మారయ్య స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.