- మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
- హృదయవిదాకారంగా ఘటన
జుక్కల్ (ప్రభంజనం): బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అరాఫత్ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీ తన ముగ్గురు పిల్లలను బైక్ పై తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న హీరా మోడల్ స్కూల్ కు తీసుకెళ్తున్నారు. తాడ్కోల్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది.

దీంతో బైక్ పై ఉన్న జైనబ్ ఫాతిమా (4) కింద పడిపోయింది. లారీ చక్రం ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
స్కూల్ కు వెళ్లాల్సిన చిన్నారి… మృత్యువు ఒడిలోకి..
సమయం ఉదయం 9 గంటలు… జైనబ్ ఫాతిమా స్కూల్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. కొత్త బూట్లు వేసుకుంది, బ్యాగ్ తగిలించుకుంది, వాటర్ బాటిల్ పట్టుకుంది. తండ్రి బైక్ ఎక్కగానే “నేను ముందు కూర్చుంటా” అంటూ మారాం చేసింది. తండ్రి ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. ఇంటి నుంచి స్కూల్ కేవలం ఐదు నిమిషాల దూరం. కానీ ఆ ఐదు నిమిషాల ప్రయాణం ఆ తల్లిదండ్రుల జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చిన్నారి ఫాతిమా నిర్లక్ష్యపై డ్రైవింగ్ కారణంగా ఆ చిన్నారి నిండు జీవితం లారీ చక్రాల కింద పడి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.


