- అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య..
- కామారెడ్డి జిల్లాలో విషాదం
జుక్కల్: ( ప్రభంజనం )
రోజు రోజుకు పెరుగుతున్న అప్పుల భారం, ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఠల్ (28) ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకున్నట్లు మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రుణాలకు సంబంధించిన ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ నెల 22న ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటిని సీజ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆగస్టు 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా.. ఆదివారం సీజ్ చేసిన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటిని సీజ్ చేయడంతో మనస్తాపానికి గురైన విఠల్ అదే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


