Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaకరీంనగర్జగిత్యాల జిల్లాలో 102 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లాలో 102 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన ఎస్పీ అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

జగిత్యాల (ప్రభంజనం): పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన 102 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ వివరాలను నమోదు చేస్తే వాటిని గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.4.5 కోట్ల విలువైన 2024 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్ పోయిన తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్ల అందులోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ముందు దాని ఐఎంఈఐ నంబర్‌ను తనిఖీ చేసి ఫోన్ స్టేటస్ తెలుసుకోవాలని సూచించారు.

ఎవరైనా మొబైల్ ఫోన్ దొరికితే సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని లేదా ఫోన్ యజమానికి సమాచారం అందించి తిరిగి ఇవ్వాలని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో సాంకేతికతను సమర్థంగా వినియోగించిన ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్, సీఈఐఆర్ బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కృష్ణ, సీఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు మల్లేశం, అజర్, అనూష, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.