Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeహైడ్రా పేరిట నకిలీ ఎన్ఓసీల దందా.. బ్రోకర్ల భారీ మోసం

హైడ్రా పేరిట నకిలీ ఎన్ఓసీల దందా.. బ్రోకర్ల భారీ మోసం

📰 Generate e-Paper Clip

  • కాలేజీ యాజమాన్యాల నుంచి లక్షల్లో వసూళ్లు
  • హైందవి కాలేజీ వ్యవహారంతో వెలుగులోకి బండారం
  • సర్టిఫికెట్ల పరిశీలనకు రంగంలోకి దిగిన అధికారులు

 

హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా (HYDRAA) పేరుతో నకిలీ సర్టిఫికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. హైడ్రా అనుమతులు, నిరభ్యంతర పత్రాల (ఎన్ఓసీ) పేరుతో కొందరు బ్రోకర్లు కాలేజీ యాజమాన్యాలను నిలువునా మోసం చేశారు. విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి.. ఏకంగా ఫోర్జరీ చేసిన నకిలీ ఎన్ఓసీలను అంటగట్టిన వైనం కలకలం రేపుతోంది.

అసలు ఏం జరిగిందంటే..?

హైడ్రా నిబంధనలు, తనిఖీల భయంతో సతమతమవుతున్న కాలేజీ యాజమాన్యాలను బ్రోకర్లు టార్గెట్ చేశారు. తమకు హైడ్రాలో పలుకుబడి ఉందని, ఎలాంటి సమస్య రాకుండా ఎన్ఓసీ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీన్ని నిజమని నమ్మిన పలు కాలేజీల యాజమాన్యాలు వారు అడిగినంత ముట్టజెప్పాయి. ఆ బ్రోకర్లు ఇచ్చిన పత్రాలే అసలైనవని భావించి కార్యకలాపాలు కొనసాగించాయి.

హైందవి కాలేజీతో బట్టబయలు..

నగరంలోని హైందవి కాలేజీ యజమానికి సంబంధించిన అనుమతుల పరిశీలన సమయంలో ఈ మోసం బయటపడింది. తమ వద్ద హైడ్రా ఎన్ఓసీ ఉందని సదరు కాలేజీ యజమాని ఇంటర్ బోర్డు అధికారులతో వాదనకు దిగారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆ పత్రాలను నిశితంగా పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది. ఈ తంతుతో అధికారులు అవాక్కయ్యారు. ఒక్క హైందవి కాలేజే కాకుండా, నగరంలోని మరికొన్ని విద్యాసంస్థలు కూడా ఇదే బ్రోకర్ల చేతిలో మోసపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

హైడ్రా సిబ్బందిపైనే అనుమానాలు..

ఈ ఫోర్జరీ దందా వెనుక హైడ్రా సిబ్బంది ప్రమేయం ఉందంటూ కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆరోపిస్తున్నాయి. అంతర్గత సమాచారం, అధికారిక పత్రాల నమూనాలు బయటకు పొక్కకుండా ఈ మోసం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా, ఈ మొత్తం వ్యవహారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వెళ్లకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంబంధిత అధికారులు.. నగరంలోని అన్ని కాలేజీల ఎన్ఓసీ పత్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన సంస్థలపై, ఈ దందా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులపై విస్తృత తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.