Sunday, August 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalఆమెను సస్పెండ్ చేయాల్సిందే.... కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి..

ఆమెను సస్పెండ్ చేయాల్సిందే…. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి..

📰 Generate e-Paper Clip

  • సీఎం, ఎమ్మెల్యేపై సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన 18 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
  • మా వాళ్లే వెనకుండి మాట్లాడిస్తున్నారు
  • క్రమ శిక్షణ తప్పిన వారిపై వేటు వేయాల్సిందే
  • పార్టీ నుండి మీరే వెళితే ఇంకా మంచిది
  • కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకుల సూచన

తెలంగాణ బ్యూరో (ప్రభంజనం ): దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తదితరులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు.

శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొండా సురేఖ వ్యవహారశైలి, ఆమె చేసిన వ్యాఖ్యలు తరచూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరోపించారు.

గతంలో కేటీఆర్, సమంత అంశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయని విమర్శించారు. తాజాగా కొండా సుస్మిత కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయని పేర్కొన్నారు. పార్టీ సభ్యురాలు కాని వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు. సుస్మిత వ్యాఖ్యల వెనుక మంత్రి కొండా సురేఖ మద్దతు ఉందన్న భావన కలుగుతోందని, ఆమెపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించే వారికి పార్టీలో కొనసాగే అర్హత లేదని వారు స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖకు పార్టీ నోటీసులు జారీ చేస్తే.. నా బిడ్డ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు’ అని చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తన కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేకపోతే, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారు. మీరు మాత్రం మంత్రి పదవిని అనుభవిస్తూ పార్టీకి ఇబ్బందులు తెస్తున్నారు అని పలువురు ప్రజా ప్రతినిధులు ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపైనా పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డిపై కూడా వారు తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏమిటో గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

మంత్రి కొండా సురేఖపై కూడా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ పార్టీలోనైనా సక్రమంగా వివాదాలు లేకుండా ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యేతో అయినా మంచి సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వెనుక మంత్రి కొండా సురేఖ ఫొటోతో కూడిన బ్యానర్ ఉండటాన్ని ప్రస్తావిస్తూ, తన కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పడం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

ఇకనైనా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కొండా సురేఖకు సూచించారు. పార్టీలో కొందరు వ్యక్తులు ఆమెకు మద్దతుగా ఉంటూ వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం ఇకనైనా ఆపాలని హితవు పలికారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చేలోపే కొండా సురేఖ స్వచ్ఛందంగా పార్టీని వీడటం మంచిదని వారు సూచించారు.

ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్‌ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.