- మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్, సెప్టెంబర్ 22 (ప్రభంజనం):
మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. జీవో 52ను రద్దు చేసి ప్రస్తుత రూ.19,500 వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. విధి నిర్వహణకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించే కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగ అవకాశం కల్పించాలని సూచించారు. కార్మికుల సమ్మెతో నగర పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చర్చలు జరిపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గణేష్ బిగాల కోరారు. కార్యక్రమంలో సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.


