- చెత్తిలెత్తేసిన హైడ్రా, డీఆర్ ఎఫ్ బృందాలు
- రోజులు గడుస్తున్నా దొరకని మృతదేహం
- ఎస్ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, డీసీ, జెడ్సీల పర్యవేక్షణ లోపం
- వర్షాకాలం ఆరంభంలోనే అభివృద్ధి పనులు
- మిగతా సమయంలో ఎందుకు గుర్తుకు రావడం లేదు?
- ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?
శేరిలింగంపల్లి ( ప్రభంజనం ):వర్షాకాలం వచ్చింది అంటే చాలు.. నీట మునుగుతున్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో చేరుతున్న నీరు… ఇబ్బందులు పడే ప్రజలు. నోరు తెరుచుకున్న మ్యాన్ హోల్స్.. భారీగా గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్.. నగరంలో ప్రతీసారీ సర్వ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఆ సమస్య నుండి బయటపడేందుకు ఎస్ఎన్డీపీ ఇంజనీరింగ్ సెక్షన్ ప్లాన్లు, అధికారులు, ప్రజా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలనలు. కోట్ల రూపాయల నిధులు విడుదల, అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రకటనలు కూడా అంతే మొత్తంలో ప్రకటనలు, హడావుడి కనిపిస్తుంది. రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్న ప్రజా ప్రతినిధుల ఆదేశాలు కూడా షరా మామూలే. కానీ ఇంతచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారా అంటే అదీలేదు. పైగా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అత్యాశ వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయినా మాకేం తెలియదు, మాదేం తప్పులేదు అంటూ ఒక శాఖ మీద మరో శాఖ నెట్టేసుకోవడం మినహా చేసిందేమీ లేదు అన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.

హఫీజ్ పేట్ ఘటనే ఇంజనీరింగ్ అధికారుల పనితీరుకు కొలమానం
ఇటీవల నగరంలో కురిసిన తేలికపాటి వర్షానికి నాలా పనుల కోసం తవ్విన గుంతలో పడి హఫీజ్ పేట ప్రాంతానికి చెందిన బాలయ్య ( 72) అనే వృద్ధుడు గల్లంతయ్యాడు. హైడ్రా, డీఆర్ ఎఫ్ బృందాలు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వారం రోజులు గడిచినా ఆయన ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన అనేక ప్రశ్నలకు, మరెన్నో అనుమానాలకు, ఎస్ ఎన్డీపీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్యానికి, కాసుల కక్కుర్తికి, కాంట్రాక్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. నాలా అభివృద్ధి పనులను వర్షాకాలం ఆరంభం అయ్యాక చేసేందుకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఎండాకాలం, చలికాలంలో ఆ 8 నెలల్లో ఎందుకు చేయలేదు. హఫీజ్ పేట్ రైల్వే బ్రిడ్జి కింద చాలాకాలంగా డ్రైనేజీ నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆవిషయం ఇంజనీరింగ్ అధికారులకు తెలియక కాదు. వర్షాకాలం కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం అంటూ ప్రకటనలు గుప్పించే అధికారులు, నాయకులు ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఆర్డర్లను పట్టించుకోవడం లేదా అంటే అవుననే అన్నట్లు కనిపిస్తుంది ఈ వ్యవహారం చూస్తుంటే.

ప్రణాళిక లేని ఎస్ ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారులు..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల వ్యవహార శైలి చూస్తుంటే మాకు మేమే మోనార్కులం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు అనేక ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తాయి. హఫీజ్ పేట్ లో బాలయ్య కనబడకుండా పోయిన ఘటనకు సంబంధించి ముందుగా ఎస్ఎన్డీపీ, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి, వారి పనితీరుకు అద్దం పడుతుంది. హఫీజ్ పేట్ రైల్వే వంతెన నుండి ఈర్ల చెరువు వరకు ఇది వరకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బాక్స్ నాలా నిర్మించారు. అయితే నాలా నిర్మాణ సమయంలో అడ్డుగా వచ్చిన పెద్ద పెద్ద రాళ్లను, అలాగే వదిలేశారని, బాక్స్ నాలా నిర్మాణంలో రాడ్లను, కట్టెలను మట్టిని అలాగే ఉంచేసి తూతూ మంత్రంగా నిర్మించి పనులు అయ్యాయని అనిపించారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా.. ఇంజనీరింగ్ అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్లు పని అయిపోయిందని చెప్పగానే కాసులకు కక్కుర్తిపడి ఎంబీలపై గుడ్డిగా సంతకాలు చేసి, బిల్లులు మంజూరుచేసి అందినకాడికి దండుకున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
బాలయ్య మృతికి ఎవరు బాధ్యులు..
నాలాలో పడి బాలయ్య మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా ఆయన శవాన్ని కూడా ఇన్నాళ్లుగా బయటకు తీయలేదు అంటే అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, పేదవాడి చావుకు వీళ్లు ఇస్తున్న విలువ ఏంటో అర్థం అవుతుంది. బాక్స్ నాలా ఉన్నది కొంత దూరమే.. ప్రతీ వంద మీటర్లకు ఒకచోట హోల్స్ ఏర్పాటు చేసి టార్చ్ లైట్లు వేసి చూసినా.. ఇంకా ఆయన మృతదేహం కూడా లభించలేదు అంటే పైన పేర్కొన్నట్టుగా నాలా మధ్యలో రాళ్లు, కట్టెలు, మట్టి పేరుకుపోయి.. అందు ఇరుక్కుపోవచ్చు అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎక్కడ రాళ్లు ఉన్నాయో గుర్తించి వాటి మధ్య ఇరుక్కుపోయాడా అన్నదానిపై దృష్టిపెట్టి మృతదేహం కోసం గాలించాలని పలువురు సూచిస్తున్నారు.
ఎస్ ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారులు ఇంకెప్పుఫు మారుతారు..
ఎస్ ఎన్డీపీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల పనితీరుపై, వారి వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు ఇన్నాళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు రివ్యూ, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఇంజనీరింగ్ లో ఏ అధికారి ఏ పనులు చేపట్టారు. ఏ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. ఎంబీల నుండి నిధుల విడుదల వరకు ఏం జరిగింది, జరుగుతుంది అనేదానిపై సమగ్ర విచారణకు, అంతర్గత ఆడిట్ కు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం ఉందనేది సుస్పష్టం. ఈ విషయం పక్కన పెడితే.
ఇటీవల నాలాలో పడిమృతి చెందిన బాలయ్య కుటుంబానికి ఎంతోకొంత ఆర్ధిక సహాయం చేసి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, పిట్స్ ఉందని, నీళ్లను చూస్తే పడిపోతాడు అని కొత్త కథనం సృష్టించి కుటుంబ సభ్యులతో ప్రకటన చేపించాలని, ఆ తప్పును ఎస్ ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారులపై నుండి తప్పించేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, మీడియాలో వార్తలు రాకుండా చూసే బాధ్యత నాది అంటూ మరో మధ్యవర్తి పైరవీలు చేస్తున్నట్టు సమాచారం.


