Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaNEET-PG 2026 :నీట్-పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు : అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

NEET-PG 2026 :నీట్-పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు : అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్: జిల్లాలో ఈ నెల 30న జరగనున్న నీట్-పీజీ (NEET-PG 2026) పరీక్షను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహిస్తారని, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,357 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కీసర, మల్కాజ్‌గిరి డివిజన్ల ఆర్డీఓలు స్వయంగా అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించి నేషనల్ బోర్డ్ సూచించిన వసతులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, తనిఖీలు మరియు ఎస్కార్ట్ సేవల కోసం మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ కిట్లు, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని సూచించారు.
అభ్యర్థుల రవాణా సౌకర్యార్థం టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, విద్యుత్ శాఖ నిరంతర కరెంట్ సరఫరాను, జలమండలి అధికారులు తాగునీటి వసతిని కల్పించాలని ఆదేశించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం జిల్లా సంక్షేమ అధికారి ప్రత్యేకంగా వీల్‌చైర్ సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాల నివారణకు జిల్లా ఫైర్ ఆఫీసర్ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని విజయేందర్ రెడ్డి నిశితంగా ఆదేశించారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.