Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeఈనెల16న మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఈనెల16న మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

📰 Generate e-Paper Clip

  • ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడిపై కేసు

సిటీ క్రైమ్ (ప్రభంజనం) : మాదాపూర్‌లో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూష్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ ఉద్యోగిని భారతి ముఖి (26) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 16న ప్రమాదం

పోలీసుల వివరాల ప్రకారం.. భారతి ముఖి మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో సేల్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఆమె తన సహోద్యోగి పూజా అశోక్‌ అలొన్‌తో కలిసి ఐటీసీ కోహినూర్‌ సమీపంలో భోజనం తీసుకురావడానికి వెళ్లారు. తిరిగి మాల్‌కు వస్తుండగా మాల్‌కు ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో ఆస్టన్‌ మార్టిన్‌ కారు ఢీకొట్టినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో భారతి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరగగా.. అనంతరం ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. ప్రమాదం గురించి సహోద్యోగి పూజా స్టోర్‌ మేనేజర్‌ పంజాల అశ్విన్‌ కుమార్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆసుపత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంజూష్‌పై బీఎన్ ఎస్ 106(1) కింద కేసు

పోలీసులు సంజూష్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్ )లోని సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేశారు.ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కారు అధిక వేగంతో, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌ ఏసీపీ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో ఇప్పటివరకు సంజూష్‌ను అరెస్ట్‌ చేయలేదు. నేరం బెయిలబుల్‌ కావడం, శిక్ష ఏడేళ్లలోపు ఉండటంతో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్‌ మార్టిన్‌ కారు టీజీ-09-జీ-0666 వాహనం హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ ఎల్ పీ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.