- టీపీసీసీకి తీర్మానం పంపిన వ్యతిరేక వర్గం
- ఇప్పటికే ఎదురుదాడి చేస్తున్న మహిళా కాంగ్రెస్ నేతలు
- ఈసారి చర్యలు పక్కా అంటున్న కొండా వ్యతిరేక వర్గం
వరంగల్ బ్యూరో: ( ప్రభంజనం )
కొండా సుస్మిత మాటల మంటలు కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఎదురుదాడి మొదలయింది. సుస్మిత వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దానికి ఆమె గురువారం వివరణ ఇచ్చుకున్నారు. తనకు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సుస్మిత వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొండా సురేఖ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యేకంగా సమావేశమై, కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి కొండా సురేఖకు, జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను కొండా కుటుంబం వ్యతిరేక వర్గం నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ కుటుంబం మొత్తం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు గురువారం ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం చేసి, దానిని టీపీసీసీకి పంపినట్లు విశ్వసినీయ సమాచారం. ఈ పరిణామంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ తీర్మానంపై టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


