- కన్న కొడుకే కాల యముడు..!
- సంగారెడ్డి జిల్లా అల్లిపూర్‌లో దారుణ ఘటన
సంగారెడ్డి ప్రతినిధి: ( ప్రభంజనం )
కేవలం రూ.500 కోసం కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన
దారుణఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో ఆ డబ్బు కోసం వెతికాడు. అనంతరం తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని అనుమానించిన తుకారం, తండ్రిని నిలదీశాడు. అయితే తాను డబ్బులు తీసుకోలేదని తండ్రి చెప్పినప్పటికీ తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహానికి గురైన తుకారం కత్తితో తండ్రిపై దాడి చేసి పొడిచినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.500 విషయంలో తలెత్తిన వివాదం చివరకు తండ్రి హత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


