Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeమాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజుష్‌కు అరెస్ట్ నోటీసులు..

మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజుష్‌కు అరెస్ట్ నోటీసులు..

📰 Generate e-Paper Clip

  • సరైన ఆధారాలు లభిస్తే అరెస్ట్ చేస్తాం:డీసీపీ రితిరాజ్

సిటీ క్రైమ్(ప్రభంజనం): మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్‌ను వెంటనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదని డీసీపీ రితిరాజ్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులోకి వచ్చే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి సంజుష్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు. అయితే ఆ పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపారు. అనంతరం సంజుష్‌ నుంచి బ్లడ్‌ శాంపిల్‌ సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.

ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) తనిఖీకి పంపినట్లు డీసీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంవీఐ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ కేసులో గరిష్ఠంగా ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం సంజుష్‌ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదని చెప్పారు. అందుకే విచారణకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35 కింద సంజుష్‌కు నోటీసులు జారీ చేసినట్లు డీసీపీ తెలిపారు.

చట్టపరమైన నిబంధనలు, కేసు పరిస్థితులు, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే అరెస్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఎంవీఐ నివేదికతో పాటు ఇతర సంబంధిత ఆధారాలను సేకరించి పరిశీలిస్తామని డీసీపీ రితిరాజ్ తెలిపారు.

ఆధారాలు లభిస్తే సంజుష్‌ను అరెస్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడిని అరెస్ట్ నుంచి తప్పించారని ఆరోపించడం సరికాదని డీసీపీ పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేసులోని అన్ని అంశాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.