Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalHarish Rao: సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే: హరీష్ రావు.

Harish Rao: సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే: హరీష్ రావు.

📰 Generate e-Paper Clip

  • అకారణంగా నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు.
  • కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 22-ఏ బాధితుల ప్రత్యేక సమావేశం.
  • బాధితులకు అండగా నిలుస్తాం..
  • డిమాండ్లు నెరవేరకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక.

మేడ్చల్(ప్రభంజనం): కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో అర్హులైన రైతులు, భూ యజమానుల ఆస్తులను అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విప్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 22-ఏ బాధితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కుటుంబాల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

22-ఏ సమస్య కేవలం రిజిస్ట్రేషన్ల అంశం కాదని, వేలాది మంది భూ యజమానుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న తీవ్రమైన సమస్యనని హరీష్ రావు వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, చట్టబద్ధమైన పత్రాలు, పట్టాలు కలిగి ఉండి, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న వారి ఆస్తులను ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్నారు. దీనివల్ల బాధితులు తమ భూములు అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. “22-ఏ అంటే కేవలం ఒక నంబర్ కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తుపై పడే తాళం” అని ఆయన అభివర్ణించారు.

సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

ప్రజల భూములను 22-ఏలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు అంటూ ప్రభుత్వ తీరును హరీష్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 22-ఏ జాబితాలో చేర్చిన మరియు తొలగించిన సర్వే నంబర్ల పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, సంబంధిత శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని సవాల్ విసిరారు.

సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి

బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు. సెప్టెంబర్ 7వ తేదీలోపు లక్షలాది మంది బాధితులతో కలిసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 22-ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల భూముల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.