- టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సోదరుడి కార్యాలయంపై దాడికి యత్నం
- కార్యాలయంపై రెక్కీ చేసిన అనంతరం దుండగుల దాడి
- కార్యాలయం వద్ద పార్క్ చేసిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
- ఘటనపై పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మేడ్చల్ ప్రతినిధి (ప్రభంజనం): జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి సోదరుడిని హత్య చేసేందుకు దుండగులు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భౌరంపేట్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర పీసీసీ మాజీ ప్రధానకార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సోదరుడు నర్సారెడ్డి వీరారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి హత్యయత్నంకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు లోకి వెళ్తే టీపీసీసీ మాజీ ప్రధానకార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి తమ్ముడు నర్సారెడ్డి వీరారెడ్డి నిజాంపేట్ సర్కిల్ లోని జీపిఆర్ లే అవుట్ లో గల తన కార్యాలయంలో ఉండగా గురువారం రాత్రి కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నర్సారెడ్డి వీరారెడ్డి తన కార్యాలయం లో ఉండగా అతని టాయోట ఫార్చునర్ కారు తన కార్యాలయం ముందు పార్క్ చేసి ఉంది. అయితే కార్యాలయం ముందు కొద్ది సేపు రెక్కీ చేసిన దుండగులు వీరారెడ్డి పై దాడులు చేసేందుకు ప్రయత్నం కోసం రాగా కార్యాలయంలో సందడి ఉండడంతో కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఈ దాడులు వెనుక ఏదైనా రాజకీయ కారణమా లేక రియల్ ఎస్టేట్ లో వ్యాపార లావాదేవీలు కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమాచారం రావడంతో బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.


