- రెండు రోజుల్లో ఐదు కేసులు ఛేదించిన పోలీసులు
- రూ. 9 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, రూ. 10 లక్షల బ్యాటరీల రికవరీ
మేడ్చల్ (ప్రభంజనం): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వివిధ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం రెండు రోజుల్లోనే ఐదు సంచలనాత్మక కేసులను ఛేదించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం మరియు విలువైన సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి మోసాలు… కానిస్టేబుల్ అరెస్ట్
మోసం మరియు ఐటీ యాక్ట్‌కు సంబంధించిన కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన కామినెడ్డి శివమోహన్ రెడ్డిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు గతంలో సుమారు 12 సంవత్సరాల పాటు ఎస్ఎఎస్ బీ (SSB) లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. అయితే విధి నిర్వహణలో అనుచిత ప్రవర్తన మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం కారణంగా సర్వీసు నుండి తొలగించబడ్డాడు.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత తేలికగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన నిందితుడు, అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడటాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత బాధితురాలితో ఫోన్‌లో పరిచయం పెంచుకుని, ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. తన కుటుంబ అవసరాలు, ఆసుపత్రి ఖర్చులంటూ నమ్మబలికి వివిధ సందర్భాల్లో రూ. 9 లక్షల నగదుతో పాటు 3.5 తులాల బంగారాన్ని కాజేసి కంభం కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నిందితుడిపై మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి మోసాలు చేసిన కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వరుస ఇళ్ల దొంగతానాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
జగద్గిరిగుట్ట పరిధిలోని అస్బెస్టాస్ కాలనీలో గత 15 రోజులుగా రాత్రి సమయాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు గరికపాటి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మూడు వేర్వేరు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. ఒక ఇంట్లో మొబైల్ ఫోన్, మరో ఇంట్లో వెండి వస్తువులు, మరొక చోట 3 గ్రాముల బంగారం, రూ. 60,000 నగదును దోచుకున్నాడు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, బంగారాన్ని స్వాధీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
రూ. 10 లక్షల విలువైన ఈవీ ఛార్జింగ్ బ్యాటరీల చోరీ గుట్టు రట్టు
జగద్గిరిగుట్ట ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న తోట గురువప్ప ఆగస్టు 15న నాలుగు బ్యాటరీలను అపహరించినట్లు స్టేషన్ సూపర్‌వైజర్ మహేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఒక్కో బ్యాటరీ విలువ రూ. 2.50 లక్షలు ఉండగా, మొత్తం నాలుగు బ్యాటరీల విలువ రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు ఆ బ్యాటరీలను స్క్రాప్ షాపులో విక్రయించి తన స్వస్థలమైన గిద్దలూరుకు పరారయ్యాడని గుర్తించిన పోలీసులు, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. గిద్దలూరులో నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన నాలుగు బ్యాటరీలను పూర్తిగా రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కుత్బుల్లాపూర్ డీసీపీ మరియు ఏసీపీల మార్గదర్శకత్వంలో… ఇన్‌స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర రెడ్డి, ఏఎస్సై రామ్ కుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు నరేష్ గౌడ్, రమేష్ మరియు డబ్ల్యూపీసీ సుమ ఈ కేసులను త్వరితగతిన చేధించడంలో విశేష కృషి చేశారు. వీరి పనితీరును అభినందించి తగిన రివార్డులతో సత్కరించనున్నట్లు పోలీసులు తెలిపారు.


