- కాంగ్రెస్ నేతపై పెట్రోల్ దాడికి రెక్కీ
- అతను కనిపించకపోవడంతో కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరార్
మేడ్చల్ (ప్రభంజనం): బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీపీఆర్ లే అవుట్ లో పార్క్ చేసి ఉంచిన కారుకు నిప్పంటించిన కేసును పోలీసులు ఛేదించారు.కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, ఘటనకు సంబంధించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 9:15 గంటల సమయంలో బాచుపల్లి జీపీఆర్ లే అవుట్ లోని నర్సరారెడ్డి వీరారెడ్డి తన కార్యాలయం వద్ద తన కారును పార్క్ చేసి ఉంచాడు.అయితే గుర్తు తెలియని వ్యక్తి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారారయ్యాడు. దీంతో కారులోని రెండు డోర్లు, పెయింట్ తదితర భాగాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.ఘటనపై బాధితుడు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడు అశోక్ రెడ్డికీ నర్సరారెడ్డి వీరారెడ్డికీ మధ్య బాచుపల్లి జీపీఆర్ లే అవుట్ లోని ప్లాట్స్ కొనుగోలు బదలాయింపులపై తగాదా నడుస్తుంది.
ఈ విషయంపై ఇద్దరి మధ్య తగాదా పెరగడం వీరారెడ్డి తనకు ఇచ్చే ప్లాట్స్ విషయంలో మోసం చేశాడని నిందితుడు ఆరోపిస్తున్నాడు. తనను ఇబ్బందులు పెడుతూ ఆర్ధికంగా నష్టం వాటిల్లీలేలా చేసిన నర్సారెడ్డి వీరారెడ్డిపై కక్ష పెంచుకున్న నిందితుడు వీరారెడ్డినీ హత్య చేసేందుకు పథకం రచించినట్లు సమాచారం.ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి వీరారెడ్డి కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించి అతను కనిపించక పోవడంతో తనతోపాటు తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ను వీరారెడ్డి కారుపై పోసి నిప్పంటించి కారులో పరారయ్యాడు.అనంతరం అమీన్ పూర్ వెళ్లి అక్కడినుండి తన స్వగ్రామంకు వెళ్లాడు. బాచుపల్లి పోలీసులు,ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా కేసుని చేధించి నిందుతుడిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.


