Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeమేడ్చల్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

📰 Generate e-Paper Clip

  • యమ్నంపేటలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

ఘట్కేసర్: ( ప్రభంజనం )

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమ్నంపేట గ్రామంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. స్థానిక శ్రీనిధి ఇంజనీరింగ్ యూనివర్సిటీ సమీపంలోని పొదల్లో సుమారు 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, సుమారు పది రోజుల క్రితమే యువతి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యువతిపై అత్యాచారం జరిగిన అనంతరం హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోచారం సబ్‌-ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు. ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఘటనకు సమీపంలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలి గుర్తింపు, ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐటీ కారిడార్ పరిధిలో, విద్యార్థులు ఎక్కువగా సంచరించే ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.