Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeవీఆర్ కే హెల్త్ కేర్ సెంటర్ పై రాయదుర్గంలో కేసు నమోదు

వీఆర్ కే హెల్త్ కేర్ సెంటర్ పై రాయదుర్గంలో కేసు నమోదు

📰 Generate e-Paper Clip

  • టైప్‌-1 డయాబెటిస్‌కు శాశ్వత నివారణ అంటూ ప్రచారం..
  • ఇన్సులిన్‌ నిలిపివేయడంతో బాధితుడికి డీకేఏ
  • వీఆర్‌కేపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
  • వీఆర్‌కే హెల్త్‌కేర్‌ సెంటర్‌పై సమగ్ర దర్యాప్తు కోరిన బాధితుడు
  • రెండు రోజుల్లోనే అత్యవసర పరిస్థితి వచ్చిందని బాధితుడి ఫిర్యాదు

సిటీ క్రైమ్: ( ప్రభంజనం )

టైప్-1 డయాబెటిస్‌ను ‘వీఆర్‌కే డైట్‌’తో శాశ్వతంగా నయం చేయవచ్చంటూ ప్రచారం చేసి, తనతో ఇన్సులిన్ వినియోగాన్ని నిలిపివేయించారని ఆరోపిస్తూ
నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన సాయి కృష్ణ (30) రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఆర్‌కే ( వీరమాచినేని రామకృష్ణ ), డాక్టర్ కోటేశ్వరరావు, షేక్‌పేట్‌లోని వీఆర్‌కే హెల్త్‌కేర్ సెంటర్‌కు చెందిన ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సాయికృష్ణ తనకు 2018 నుంచి టైప్-1 డయాబెటిస్ ఉందని, అప్పటి నుంచి ఇన్సులిన్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వీఆర్‌కే డైట్‌తో టైప్-1 డయాబెటిస్ సహా పలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చన్న ప్రచారాన్ని నమ్మి 2025 సెప్టెంబర్ 12న షేక్‌పేట్‌లోని కేంద్రాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. అక్కడ ఇన్సులిన్ నిలిపివేసి వీఆర్‌కే డైట్‌ను పాటించాలని సూచించారని, డైట్‌, సప్లిమెంట్ల కోసం సుమారు రూ.26 వేలు చెల్లించానని ఆరోపించారు.
ఇన్సులిన్ నిలిపివేసిన రెండు రోజుల్లోనే అధిక రక్త చక్కెర, వాంతులు, శరీర నొప్పులు వంటి సమస్యలు తలెత్తడంతో సెప్టెంబర్ 14న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. వైద్యులు డయాబెటిక్ కీటో ఆసిడోసిస్ (డీకేఏ), తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నట్లు నిర్ధారించారని, సెప్టెంబర్ 17న డిశ్చార్జి అయ్యానని పేర్కొన్నారు. చికిత్సకు రూ.58,219 ఖర్చయిందని తెలిపారు. ఇన్సులిన్ నిలిపివేయడం, డీకేఏ రావడం మధ్య సంబంధాన్ని స్వతంత్ర డయాబెటిస్ నిపుణుడితో వైద్య రికార్డుల ఆధారంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. ఇన్సులిన్ ఆపడం వల్ల కలిగే ప్రమాదాలు, రక్తంలో చక్కెరను పర్యవేక్షించే విధానంపై తనకు తగిన సూచనలు ఇవ్వలేదని ఆరోపించారు. వీఆర్‌కేకు వైద్య అర్హత లేదని పేర్కొన్న వీడియోలు ఉన్నప్పటికీ ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తున్నారని సాయి కృష్ణ ఆరోపించారు. కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వరరావు అర్హతలు, ఇన్సులిన్ నిలిపివేయాలని సూచించే అధికారం తదితర అంశాలపై విచారణ జరపాలని కోరారు.
కేంద్రంలో ఇలాంటి సూచనలు పొందిన ఇతర టైప్-1 డయాబెటిస్ రోగుల వివరాలు, చెల్లింపులు, కేంద్రం రిజిస్ట్రేషన్లు, అనుమతులు, లైసెన్సులు, జీఎస్టీ నమోదు, సప్లిమెంట్ల చట్టబద్ధతపైనా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేబర్ లైసెన్స్‌లో ఐదుగురు ఉద్యోగులు ఉన్నట్లు చూపిస్తుండగా, కేంద్రంలో సుమారు 80 మంది పనిచేస్తున్నారన్న సమాచారంపైనా విచారణ కోరారు. ఈ వ్యవహారంపై నాంపల్లి వినియోగదారుల కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తన ఆరోపణలకు మద్దతుగా వైద్య రికార్డులు, బిల్లులు, సోషల్ మీడియా ఆధారాలు, చెల్లింపుల వివరాలు తదితరాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వీఆర్ కేపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయడంతో పాటు, ఇలాంటి సూచనలతో మరెంతమంది రోగులు ప్రభావితమయ్యారో తేల్చాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.