- ఔషాపూర్ వద్ద రైలు ఢీకొని మూగజీవాల మృత్యువాత
- దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని 100కుపైగా గొర్రెలు బలి!
- రైలు శబ్దానికి బెదిరిన గొర్రెలు.. పట్టాలపైకి పరుగులు
- కాపరుల కళ్లముందే మూగజీవాల మృతి.. విషాదం!
ఘట్‌కేసర్, (ప్రభంజనం):
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… కేపాల్ సమీపంలో కాపరి నిద్రిస్తున్న సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు శబ్దానికి గొర్రెలు బెదిరిపోయాయి. భయంతో ఒక్కసారిగా పట్టాలపైకి పరుగులు తీయడంతో వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 100కు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోగా, జీవనాధారమైన మూగజీవాలు కళ్లముందే మరణించడంతో కాపరులు తీవ్ర గుండెకోతకు గురయ్యారు. మృతి చెందిన గొర్రెలు యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అల్లి నగర్‌కు చెందిన వారివిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


