Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeబోనాల వేడుకల్లో ఘోరం.. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి...

బోనాల వేడుకల్లో ఘోరం.. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి…

📰 Generate e-Paper Clip

  • తెల్లాపూర్ ‘శిఖరం’ ప్లే స్కూల్‌లో తీవ్ర విషాదం..
  • స్కూల్ నుంచి బయటకొచ్చి ‘మేళ్ల చెరువు’లో పడ్డ షణ్ముఖ్…
  • కొడుకు దూరం కావడంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
  • యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు..

పటాన్ చెరు,(ప్రభంజనం):   పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఉదయాన్నే నవ్వుతూ స్కూలుకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు, కొద్ది గంటల్లోనే చెరువులో శవమై తేలిన విషాద సంఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.వివరాల్లోకి వెళ్తే తెల్లాపూర్ లోని ‘శిఖరం’ ప్లే స్కూల్‌లో ఆరేళ్ల బాలుడు షణ్ముక్ ఒకటవ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తండ్రి ఉదయ్ కిరణ్ ఎప్పటిలాగే బాలుడిని స్కూల్ వద్ద దింపి వెళ్లారు. పాఠశాలలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో సిబ్బంది, విద్యార్థులు ఆ వేడుకల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆ సమయంలో పాఠశాల గేటు తెరిచి ఉండటంతో షణ్ముక్ ఎవరికీ కనిపించకుండా బయటకు వచ్చేశాడు. పాఠశాలకు సరిగ్గా ఎదురుగా ఉన్న ‘మేళ్ల చెరువు’ వైపు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు. కొంతసేపటికి బాలుడు కనిపించకపోవడంతో వెతికిన పాఠశాల సిబ్బందికి, ఎదురుగా ఉన్న చెరువులో షణ్ముక్ విగతజీవిగా కనిపించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు అకస్మాత్తుగా శవమై మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన బాలుడు షణ్ముక్ కొంతకాలంగా ఆటిజంతో బాధపడుతున్నాడని, ఇటీవల ఆరోగ్యం మెరుగుపడుతున్న సమయంలో ఈ విషాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, గేటు వద్ద పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని చెరువు నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొల్లూరు సీఐ సైదిరెడ్డి పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.