- గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. రాఘవ ప్రాజెక్ట్ లేబర్ క్యాంప్ నుంచి ప్రమీలా ముర్ము (4), సంగీత (3) అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. పిల్లలను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి వారి తల్లిదండ్రుల సహోద్యోగి చాకు సోరెన్ వెంట తీసుకెళ్లాడు. అయితే ఎంతసేపటికీ చిన్నారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అర్ధరాత్రి దాటినా చిన్నారులతో పాటు చాకు సోరెన్ కూడా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చిన్నారులను తీసుకెళ్లిన వ్యక్తి కదలికలను గుర్తించారు. అనంతరం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో చాకు సోరెన్‌ను అదుపులోకి తీసుకుని, చిన్నారులను సురక్షితంగా గుర్తించారు. పోలీసులు ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


