Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeకోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

📰 Generate e-Paper Clip

  • కంటెనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..
  • ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
  • క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
  • కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఘటన

నల్గొండ బ్యూరో: ( ప్రభంజనం )

సూర్యాపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారాకుంట శివారులో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున బస్సు ద్వారాకుంట శివారుకు చేరుకున్న సమయంలో ఆగి ఉన్న కంటైనర్‌ లారీని బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతినడంతో పలువురు ప్రయాణికులు బస్సులో ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి అంబులెన్సుల ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తుండగా, మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం కారణంగా హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.