- బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
క్రైమ్ బ్యూరో: ( ప్రభంజనం )
ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్యకు గురైన ఘటన
బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన రెహానా ( 21 ) బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి
పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే ఫంక్షన్ హాల్‌లో పనిచేసే మహ్మద్ సలామ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని రెహానా సలామ్‌పై ఒత్తిడి చేయడం, మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో సలామ్ ఆమెపై ఆగ్రహం పెంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ క్రమంలో గతరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ సమయంలో సలామ్ కత్తితో రెహానాపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలో సలామ్‌తోపాటు మరో ఇద్దరి పాత్ర ఉందా? మృతదేహాన్ని తరలించేందుకు వారు సహకరించారా? హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందా? లేక గొడవలో క్షణికావేశంతో దాడి జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


