హైదరాబాద్ :టీపీసీసీ ప్రతినిధి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బుడ్డ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.బుడ్డ సత్యనారాయణను కులం పేరుతో దూషిస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఈ వ్యవహారంపై గత మూడు రోజులుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళిత, ఎస్టీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నిందితుడిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.బాధితుడి ఫిర్యాదు మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోపై పోలీసులు లీగల్ ఒపీనియన్ (న్యాయ సలహా) తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహా అనంతరం, ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎల్బీనగర్ పోలీసులు వెల్లడించారు.


