- జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్రంగా పోటీ
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పదవికి బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ఎఫ్) తరఫున స్నేహ వంకుడోతు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బహుజన విద్యార్థుల స్వయంప్రతిపత్తి, సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులను కేంద్రంగా చేసుకుని ఈసారి బీఎస్ఎఫ్ స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది.
వరంగల్ జిల్లాలోని గిరిజన గ్రామానికి చెందిన స్నేహ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూలో సామాజిక శాస్త్రంలో మాస్టర్స్ చేస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా తనలాంటి ఆదివాసీ, బహుజన విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు లభించాయని, ఆ హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘం వేదికగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. బుద్ధుడు, ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్, రమాబాయి, పెరియార్, కాన్షీరాం వంటి మహనీయుల సమానత్వం, విద్య, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటాల స్ఫూర్తిని విద్యార్థి రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లడం బీఎస్ఎఫ్ తన రాజకీయ లక్ష్యంగా పేర్కొంది. బహుజన భావజాలాన్ని క్యాంపస్‌లో విస్తృతంగా చర్చకు తీసుకురావడంతో పాటు విద్యార్థుల వాస్తవ సమస్యలపై కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందేలా కృషి చేయడం, మెస్, క్యాంటీన్ ధరలు అందుబాటులో ఉండేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం, మహిళలు, దివ్యాంగులు సహా అందరికీ సురక్షితమైన సమ్మిళిత క్యాంపస్ కోసం పనిచేయడం తమ ప్రధాన అంశాలని బీఎస్ఎఫ్ తెలిపింది. విద్యార్థులకు జవాబుదారీతనంతో పనిచేసేలా బహిరంగ సమావేశాలు నిర్వహించి సమస్యలను నేరుగా పరిష్కార ప్రక్రియలోకి తీసుకెళ్లాలని పేర్కొంది. సెప్టెంబర్ 28న జరిగే ఎన్నికల్లో స్నేహ వంకుడోతు బీఎస్ఎఫ్ తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బహుజన విద్యార్థుల స్వయంప్రతిపత్తి, సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులపై బీఎస్ఎఫ్ తన ఎన్నికల వైఖరిని విద్యార్థుల ముందుంచింది.


