- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దాడి ఘటన
- ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ కాదు, హోంగార్డుగా గుర్తింపు
- కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
- ఘటనపై వివరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్
సిటీ క్రైమ్: ( ప్రభంజనం )
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై ఓ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. మహిళను కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. తొలుత ఈ ఘటనకు పాల్పడింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) కానిస్టేబుల్‌గా ప్రచారం జరిగినప్పటికీ.. దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) విచారణలో అతను ఆర్ పీఎఫ్ సిబ్బంది కాదని, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు అని స్పష్టం చేసింది.
వైరల్‌గా మారిన వీడియో..
శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఓ మహిళతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం ఆమెపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది. అక్కడున్న మరో వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ సిబ్బంది మహిళను కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ కాదని రైల్వే అధికారుల స్పష్టీకరణ
వీడియో వైరల్ కావడంతో తొలుత దాడి చేసిన వ్యక్తిని ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్‌గా పలువురు పేర్కొన్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే విచారణ చేపట్టింది. విచారణ అనంతరం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు అని, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో విధుల నిర్వహణ కోసం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడని ఎస్సీఆర్ వెల్లడించింది. ఘటనపై విచారణ అనంతరం అతడిని తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు పంపించినట్లు, అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అప్పగించినట్లు ఎస్సీఆర్ తెలిపింది.
హోం గార్డుపై కేసు నమోదు.. అరెస్ట్.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఆ హోమ్ గార్డ్ రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడని,
అతనిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే
తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని డీజీపీ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. వెంటనే స్పందించిన మియాపూర్ పోలీసులు నిందితుడు ఆనంద్ పై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.


