Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeబావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

📰 Generate e-Paper Clip

  • అతివేగమే కారణమా ..? దుబ్బాకలో విషాద ఘటన

దుబ్బాక (ప్రభంజనం): అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (33) ఇసుక వ్యాపారం చేస్తూ భార్య భాగ్యలక్ష్మి (25), కుమారుడు నేహాన్స్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి ఉంటున్నారు. ఇటీవల సిద్దిపేటలో మృతి చెందిన రాజు బావ దశదినకర్మకు బుధవారం కుటుంబంతో కలిసి కారులో వెళ్లారు. కార్యక్రమం అనంతరం రాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పనపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో కొంతసేపటి వరకు విషయం వెలుగులోకి రాలేదు. రాజు కుటుంబం బల్వంతాపూర్‌కు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు రాత్రి 10.30 గంటల సమయంలో దుబ్బాక పోలీసులను ఆశ్రయించారు.

సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి 11.30 గంటల సమయంలో అప్పనపల్లి శివారులో వాహనం ఉన్నట్లు గుర్తించారు. పరిసరాలను పరిశీలించగా రహదారి పక్కనున్న బావిలో కారు కనిపించింది.

మూడు గంటలపాటు సహాయక చర్యలు

దుబ్బాక సీఐ రాజేష్‌ ఆధ్వర్యంలో ఎస్సై కీర్తిరాజు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి క్రేన్‌ సాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న రాజు, భాగ్యలక్ష్మి, నేహాన్స్‌, శాన్విక మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

విషయం తెలుసుకున్న సిద్దిపేట సీపీ రశ్మి పెరుమాళ్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి గురువారం ఉదయం దుబ్బాక ఆసుపత్రి మార్చురీని సందర్శించారు. మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి బావిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ తెలిపారు.

మృతుడి అన్న యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక ఎస్సై కీర్తిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.