Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeభూములపై బ్యాంకు రుణాల పేరుతో మోసం.. అంతరాష్ట్ర కేటుగాడు అరెస్ట్

భూములపై బ్యాంకు రుణాల పేరుతో మోసం.. అంతరాష్ట్ర కేటుగాడు అరెస్ట్

📰 Generate e-Paper Clip

క్రైమ్ బ్యూరో(ప్రభంజనం ):సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి ఆస్తుల సేల్ డీడ్ పత్రాలను దుర్వినియోగం చేస్తూ మూడో వ్యక్తుల పేర్లకు బదలాయించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కేటుగాడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2016 నుంచి 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుడిని రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నునావత్ యుగంధర్ (34)గా గుర్తించారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులను మోసం చేసి రూ.10 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

రూ.60 లక్షల ఆర్థిక సాయం పేరుతో..

ఓ ఫిర్యాదుదారుడికి యుగంధర్ రూ.60 లక్షల ఆర్థిక సాయం అందించాడు. ఇందుకు సంబంధించి ఆస్తిని వేరొకరికి విక్రయించబోనని ఒప్పందం కుదుర్చుకుని సేల్ డీడ్ రాయించుకున్నాడు. అయితే ఫిర్యాదుదారుడికి తెలియకుండా ఆ పత్రాలను దుర్వినియోగం చేసి ఆస్తిని మూడో వ్యక్తి పేరుకు బదలాయించాడు. అనంతరం అదే ఆస్తిని కుదువపెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.1.50 కోట్ల రుణం పొందాడు. రుణాన్ని చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ ఫిర్యాదుదారుడికి నోటీసులు పంపారు. దీంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే 20కి పైగా కేసులు..

యుగంధర్‌ పై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు, 8 సివిల్ మరియు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ( ఎన్ ఐ ) యాక్ట్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మరో నాలుగు కేసుల్లో అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, బాధితుల నుంచి ఆస్తి పత్రాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేయడం నిందితుడి మోసాల తీరుగా పోలీసులు గుర్తించారు.

సీసీఎస్ పోలీసుల అరెస్ట్

హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ పర్యవేక్షణలో, ఈఓడబ్ల్యూ టీమ్-5 ఏసీపీ కె. కిరణ్ మార్గదర్శకత్వంలో ఎస్‌ఐ జి. అనిల్ కుమార్, సిబ్బంది నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు క్రైం నంబర్ 128/2026, సెక్షన్ 420 కింద నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఆస్తులపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పే నకిలీ ఫైనాన్స్ కన్సల్టెన్సీలు, వ్యక్తిగత మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సీసీఎస్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను ఇతరులకు అప్పగించే ముందు పూర్తి వివరాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.