కూకట్ పల్లి( ప్రభంజనం ): కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ (JNTU) క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, డయల్ 100కు ఫిర్యాదు అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని డీసీపీ తెలిపారు. అయితే అర్దరాత్రి 2:30 గంటల ప్రాంతంలో విద్యార్థులు మరలా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి గాయాలైనట్లు చెప్పారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
గొడవకు అసలు కారణం ఇదే..
మొదటగా కాలేజీకి చెందిన ఒక అమ్మాయికి సమస్య ఎదురుకావడంతో ఆమె తన స్నేహితుడికి ఫిర్యాదు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ విషయమై మాట్లాడుకుంటున్న సమయంలో మాటామాటా పెరిగి వివాదం పెద్దదైంది. క్రమంగా ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని వివరించారు.
మద్యం మత్తులో విద్యార్థి..
ఈ ఘటనలో పాల్గొన్న ఒక విద్యార్థి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఆ విద్యార్థి బయట మద్యం తాగి క్యాంపస్‌లోకి వచ్చాడా, లేక హాస్టల్/క్యాంపస్ లోపలే సేవించాడా అనే కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ రితిరాజ్ తెలిపారు. త్వరలోనే జేఎన్టీయూ ప్రిన్సిపల్, వార్డెన్‌లతో సమావేశమై క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు, కార్చచరణపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.


