- ముక్కు ఎముక విరగడంతో శస్త్రచికిత్సకు వైద్యుల సూచన.
- సీనియర్లతో పాటు కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు
ఎల్బీనగర్,(ప్రభంజనం): ఫెస్ట్ కు సంబంధించిన చర్చ నేపథ్యంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. చైతన్యపురి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… సరూర్‌నగర్‌కు చెందిన అఖిల్తేజ (17) కొత్తపేటలోని ఫిజిక్స్ వాలా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ చర్చ సందర్భంగా సీనియర్లు జూనియర్లను వేధించారు. అనంతరం కాలేజీ సమీపంలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు అఖిల్ తేజపై పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనలో విద్యార్థికి ముక్కు ఎముక విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అఖిల్తేజ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.


