హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ శాసనసభా పక్ష (BRSLP) సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు.

సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సంయుక్త సమావేశం జరగనుంది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సభలో గళం వినిపించే తీరుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.


