Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalఫారెస్ట్ కాదు.. హోంశాఖ కావాలి..! హైకమాండ్ ముందు కీలక డిమాండ్స్ పెట్టిన విజయ శాంతి..

ఫారెస్ట్ కాదు.. హోంశాఖ కావాలి..! హైకమాండ్ ముందు కీలక డిమాండ్స్ పెట్టిన విజయ శాంతి..

📰 Generate e-Paper Clip

  • ఆ డమ్మీ శాఖ రేవంత్‌కే ఇవ్వండి.. నాకు హోం ఇవ్వండి!
  • రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి ఎంట్రీ ఖరారేనా?
  • కేబినెట్‌లో చేరితే హోంశాఖే కావాలని విజయశాంతి పట్టు
  • బీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకే విజయశాంతికి కీలక పోస్ట్
  • కొండా బర్తరఫ్ వేళ హాట్ టాపిక్‌గా మారిన పోర్ట్‌పోలియో లొల్లి
  • రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ముగ్గురు కొత్త మంత్రులకు ఛాన్స్
  • రేసులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా
  • మహిళా కోటాలో విజయశాంతితో పాటు యశస్వినీ రెడ్డి, పద్మావతి రెడ్డి ఆశలు
  • కొత్త మంత్రుల ఎంపికతో పాటు శాఖల కేటాయింపులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు

తెలంగాణ బ్యూరో, (ప్రభంజనం): రాష్ట్ర రాజకీయాల్లో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆమె స్థానంలో మరో మహిళా నేతను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశంపై కాంగ్రెస్‌ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ఆమె మంత్రి పదవి కోసం హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో సీతక్క ఒక్కరే మహిళా మంత్రిగా ఉన్నారు. దీంతో సురేఖ స్థానంలో మరో మహిళా నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ తరఫున పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. విజయశాంతికి అవకాశంఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే మమిడాల యశస్వినీ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌ నేతగా విజయశాంతి గుర్తింపు పొందారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఎంపీగా పనిచేసిన ఆమెకు ఆ పార్టీ రాజకీయాలు, నేతల వ్యవహారశైలిపై మంచి అవగాహన ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో విజయశాంతి వంటి బలమైన వాయిస్‌ కేబినెట్‌లో ఉంటే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వగల నేతగా ఆమెను పరిగణిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవిపై చర్చల నేపథ్యంలో విజయశాంతి ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైకమాండ్‌ పెద్దలను కలిసి తన రాజకీయ భవిష్యత్తు, మంత్రి పదవిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. పార్టీపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా.. అప్పుడప్పుడు రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. దీంతో ఆమెకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే పార్టీకి మరింత బలమైన స్వరం లభిస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

హోంశాఖ కావాలని పట్టు..

విజయశాంతి కేబినెట్‌లో చేరితే హోంశాఖ కావాలని కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు కేబినెట్‌లోకి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను తీసుకునే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేబినెట్‌లో రెండు ఖాళీలు ఉండగా.. తాజాగా కొండా సురేఖ బర్తరఫ్‌తో మొత్తం ఇద్దరు లేదా ముగ్గురు కొత్త ముఖాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్‌ మంత్రుల శాఖలను మార్చే అవకాశాలపై కూడా కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతికి నిజంగానే మంత్రి పదవి దక్కుతుందా.. దక్కితే ఆమె కోరుకుంటున్న హోంశాఖనే కేటాయిస్తారా.. అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.