- ప్రారంభించిన పీఏసీ ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి ( ప్రభంజనం ): మదీనాగూడలోని ప్రణామ్ హాస్పిటల్స్ నూతన భవనంలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 పడకల ‘మదర్ అండ్ చైల్డ్’ ఆసుపత్రిని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. డాక్టర్ మనీష్ గౌర్ నేతృత్వంలోని బృందం అన్ని ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని తీర్చిదిద్దిందని ప్రశంసించారు. 100 పడకల సామర్థ్యంతో పాటు మూడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఇన్ఫెక్షన్ నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రణామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గౌర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆసుపత్రిలో 150 పడకల మల్టీ-స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళలు, చిన్నారులకు మరింత ప్రత్యేకమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే కొత్తగా 100 పడకల మదర్ అండ్ చైల్డ్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కొత్త భవనంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, ఎన్ఐసీయూ, పీఐసీయూ, మెటర్నల్ ఐసీయూలతో పాటు లగ్జరీ సూట్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందిస్తూ, ప్రతి కుటుంబానికి సొంత కుటుంబ వైద్యుడిలా ఆత్మీయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహా భారాన్ని లేకుండా ఫ్యామిలీ హాస్పిటల్ గా రోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, భవిష్యత్తులో టైర్-2, టైర్-3 నగరాలకు కూడా తమ ఆసుపత్రి నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ ప్రసాద్, సీఓఓ గీతా భవాని, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


